శృంగేరి శారదా పీఠాధిపతిని కలిసిన టీటీడీ చైర్మన్
బీఆర్ నాయుడు..సతీమణికి స్వామీజీ ఆశీర్వాదం
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు ఆయన సతీమణి తిరుమలకు విచ్చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక జగద్గురు శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ విదు శేఖర భారతి తీర్థ స్వామీజీని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్బంగా బీఆర్ నాయుడు, సతీమణిని ఆశీర్వదించారు. అనంతరం సనాతన ధర్మవ్యాప్తి విస్తృతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చైర్మన్ స్వామీజీతో చర్చించారు. ప్రధానంగా తిరుమల పవిత్రమైన పుణ్య క్షేత్రమని, ఆ పవిత్రతకు భంగం కలగకుండా కృషి చేయాలని సూచించారు శ్రీ విదు శేఖర భారతి తీర్థ స్వామీజీ.
ప్రపంచ వ్యాప్తంగా అష్ట కష్టాలు పడి భక్తులు తిరుమలకు విచ్చేస్తుంటారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలను కల్పించాలని, ఇదే సమయంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి , శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకునే భాగ్యాన్ని ప్రసాదించాలని హితవు పలికారు. అన్ని దానాలలో కంటే అన్న దానం గొప్పదని, ప్రస్తుతం లక్షలాది మంది భక్తులకు నిరంతరాయంగా కల్పిస్తున్న తీర్థ, అన్న ప్రసాదాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
ధర్మ ప్రచార పరిషత్ ద్వారా, ఆయా మఠాల స్వామీజీలతో అనుసంధానం చేసుకుంటూ దేశ వ్యాప్తంగా ధర్మ ప్రచారం చేపట్టాలని, ప్రతి నోటా ప్రతి ఇంటా ఆధ్యాత్మిక పరిమలాలు వెదజల్లాలని కోరారు.