రేవంత్..మోడీ వల్లనే నిషేధం
నిప్పులు చెరిగిన జగదీశ్వర్ రెడ్డి
సూర్యాపేట – మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. తమ పార్టీ బాస్ , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం పై ఎన్నికల సంఘం నిషేధం విధించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి, పీఎం మోదీ ఉన్నారంటూ ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వ లేకనే ఈ కుట్రకు తెర లేపారంటూ మండిపడ్డారు. దీనిని ఎవరూ హర్షించరని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన సీఎం కావాలని తమను ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఇదే సమయంలో ప్రధాన మంత్రి మోడీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ , ప్రసంగాలు, ఫేక్ వీడియోలు ఎన్నికల సంఘానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేవలం పదవులను అడ్డం పెట్టుకుని ఒత్తిళ్లు చేసినంత మాత్రాన ఒరిగేది ఏమీ ఉండదన్నారు. కాంగ్రెస్, బీజేపీకి గుణ పాఠం చెప్పక తప్పదన్నారు.