అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు
తిరుపతి – ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఐదో రోజు గురువారం మోహినీ అలంకారంలో రాముల వారు జగన్మోహనాకారుడిగా భక్తులకు దర్శనం ఇచ్చారు.
ఉదయం 7.30 గంటలకు స్వామివారి ఊరేగింపు వైభవంగా ప్రారంభమైంది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.
మోహినీ అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణింప బడింది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీర సాగరాన్ని మథిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది. దానిని పంచుకోవడంలో కలహం ఏర్పడుతుంది. ఆ కలహాన్ని నివారించి, దేవతలకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరిస్తాడు. తనకు భక్తులు కానివారు ఆ మాయలో ఉంటారనీ తనకు ప్రసన్నులైన వారు మాయను సులభంగా దాటగలరనీ ఈ మోహినీ రూపంలో రాములవారు ప్రకటిస్తున్నారు.
వాహన సేవలో ఆలయ డెప్యూటీ ఈఓ నటేష్ బాబు, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.