వెన్నుపోటుకు కేరాఫ్ హరీష్ రావు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి
హైదరాబాద్ – టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ , మాజీ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వాన్ని కూల్చడంపై కుట్రలు మానేసి ముందు మీ పార్టీని చూసు కోవాలని సూచించారు.
కేసీఆర్ , కేటీఆర్ , కవితకు పక్కలో బల్లెంలా మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తయారయ్యాడని ముందు ఆయన నుంచి వెన్ను పోటుకు గురి కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. తమ సర్కార్ కు ఢోకా లేదన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
తాము తల్చుకుంటే బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ కాక తప్పదన్నారు జగ్గా రెడ్డి. ఏదో ఒక రోజు హరీశ్ రావు ముంచడం పక్కా అన్నారు . పదేళ్ల పాటు తెలంగాణలో కొలువు తీరిన బీఆర్ఎస్ సర్కార్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని , ఇవాళ ఖాళీ ఖజానా ఇచ్చి పాలించమంటే ఎలా అని ప్రశ్నించారు.
అయినా అష్ట కష్టాలు పడి తాము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని, ఇంకోసారి అనవసరంగా తమ సర్కార్ పై అనుచిత కామెంట్స్ చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు జగ్గా రెడ్డి.