జస్ట్ ట్రైలర్ మాత్రమే ముందుంది మూవీ
మాజీ మంత్రి హరీశ్ రావకు జగ్గారెడ్డి వార్నింగ్
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు చెందిన క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడారు. జస్ట్ ఇది ట్రైలర్ మాత్రమేనని ముందుంది అసలైన సినిమా అంటూ ఏకి పారేశారు.
జగ్గారెడ్డి తనదైన స్టైల్ లో విరుచుకు పడ్డారు. సిద్దిపేటను తన అడ్డాగా మార్చుకుని అడ్డగోలుగా తమ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులను అక్రమంగా కేసులు బనాయించేలా చేయడం, దాడులకు ఉసిగొల్పేలా చేసిన చరిత్ర హరీశ్ రావుది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ పదేళ్ల పాలనా కాలంలో హరీశ్ రావు రెచ్చి పోయాడని, మామను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా కామెంట్స్ చేశాడంటూ మండిపడ్డారు జగ్గా రెడ్డి. మీరు చేసిన దాంట్లో కాంగ్రెస్ శ్రేణులు చేసింది కేవలం గోరంతేనంటూ ఎద్దేవా చేశారు.
మాజీ మంత్రికి ఏజెంట్ గా అప్పటి సీఐ సురేందర్ రెడ్డి పని చేశాడని ఆరోపించారు. మదం ఎక్కిన ఆంబోతులా రెచ్చి పోయాడని, హరీశ్ రావు ఏది చెబితే అది చేస్తూ తమ పార్టీకి చెందిన వారిని నానా రకాలుగా చిత్రహింసలకు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు జగ్గా రెడ్డి.
ఆరోజే నీ సంగతి చూస్తానంటూ సీఐకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చానని చెప్పారు. ఇకనైనా వళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని బీఆర్ఎస్ శ్రేణులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.