జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే జంప్
గులాబీ బాస్ కేసీఆర్ కు బిగ్ షాక్
హైదరాబాద్ – నిన్నటి దాకా రాష్ట్రంలో చక్రం తిప్పిన బీఆర్ఎస్ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోలుకోలేని షాక్ లు తగులుతున్నాయి. ఓ వైపు తనకు కుడి భుజంగా భావించిన భాన్సువాడ ఎమ్మెల్యే , మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. తనతో పాటు కొడుకుతో సహా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సీఎం స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. అక్కడే పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
ఈ షాక్ నుంచి కోలుకోక ముందే కేసీఆర్ కు, ఆయన కుటుంబానికి ప్రత్యేకించి కూతురు కల్వకుంట్ల కవితకు సన్నిహితుడిగా పేరు పొందిన జగిత్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఉన్నట్టుండి తాను పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. ఆ వెంటనే పార్టీకి రాజీనామా చేశారు.
అనంతరం హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.