నిప్పులు చెరిగిన బీసీ సంక్షేమ సంఘం నేత
హైదరాబాద్ – రాష్ట్ర సమాచార కమిషనర్ నియామకాల్లో సామాజిక న్యాయం పూర్తిగా కొరబడిందని, రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా బీసీలకు ఒక్కటి కూడా అవకాశం ఇవ్వకుండా, అగ్రకులాలకే ప్రయారిటీ ఇచ్చిందని ఆరోపించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ .సమాచార కమిషనర్ పదవులు కట్టబెట్టడాన్నీ తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, తెలంగాణలో జరిగిన కులగనన లెక్కల ప్రకారం ప్రతి నామినేటెడ్ పోస్టులో 56% బీసీలకు వాటా కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు
బీసీ కుల సంఘాల జేఏసీ కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, బీసీ మేధావుల వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ ఏం బాగయ్య, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కురుమలతో కలిసి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు
కాంగ్రెస్ ప్రభుత్వం కులగనణ చేసి ఎవరి వాటా వారికి ఇస్తామని ఒకవైపు హామీలు గుప్పిస్తూ ఇంకో వైపు వాటిని అమలు చేయకపోవడం తగదన్నారు . సమాచార కమిషనర్ పదవుల భర్తీలో బీసీలను పక్కకు పెట్టడం ఇది రెండు కోట్ల మంది బీసీలను అవమానించడం అవుతుందని ఆయన అన్నారు .సమాచార కమిషనర్ లు కావలసిన అన్ని అర్హతలు బీసీలకు ఉన్నప్పటికీ నియమకాల్లో మాత్రం బీసీ కులమే అనర్హతగా మారిందంటూ వాపోయారు.
తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకుని ఖాళీగా ఉన్న మిగతా మూడు సమాచార కమిషనర్ పదవులను బీసీలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు .