భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన పార్టీ
అమరావతి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ముస్తాబవుతోంది. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్ సారథ్యంలో కనీవిని ఎరగని రీతిలో సభను నిర్వహించేలా ప్లాన్ చేశారు. అతిరథ మహారథులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని వెల్లడించారు. రాష్ట్రం నలు మూలల నుంచి జనసేన పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పవన్ అభిమానులు తండోప తండాలుగా తరలి వస్తున్నారు. అందరూ పిఠాపురం బాట పట్టారు. ఎక్కడ చూసినా జనసేన పార్టీ జెండాలు అగుపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా పార్టీ స్థాపించిన తర్వాత ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అనూహ్యమైన రీతిలో జనసేన అద్భుతమైన ఫలితాలను సాధించింది. ఇదంతా పవన్ కళ్యాణ్ ఒక్కడి వల్లనే సాధ్యమైందని పేర్కొన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇదిలా ఉండగా జనసేన పార్టీ సభకు జనసేన జయకేతనం అని పేరు పెట్టారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సభకు హాజరవుతారు పవన్ కళ్యాణ్ కొణిదెల. 250 మంది కూర్చునేలా సభా వేదిక, గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రాంగణ ప్రధాన ద్వారాలకు మహనీయుల పేర్లు పెట్టారు. సభా ప్రాంగణంలో 15 ఎల్ఈఈ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. 1700 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు.