జనసేన అభ్యర్థిగా మండలి బుద్దప్రసాద్
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ
మంగళగిరి – జనసేన పార్టీ సంచలన ప్రకటన చేసింది. ఏపీలోని అవనిగడ్డ శాసన సభ నియోజకవర్గం నుంచి తమ పార్టీ తరపున ప్రముఖ రాజకీయ నాయకుడు, సాహితీవేత్త మండలి బుద్ద ప్రసాద్ బరిలో ఉంటారని ప్రకటించింది. ఈ మేరకు పార్టీ చీఫ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిపింది.
మండలి బుద్ద ప్రసాద్ కు అపారమైన రాజకీయ అనుభవం ఉంది. ఆయన ఏపీలో శాసనసభ ఉప సభాపతిగా పని చేశారు. మాజీ మంత్రిగా కూడా ఉన్నారు. తెలుగు అంటే వల్లమాలిన అభిమానం. ఏపీ రాజకీయాలలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర కనబరుస్తూ వచ్చారు.
తెలుగు భాషా, సంస్కృతులపై మంచి పట్టు కలిగిన నాయకుడిగా ఉన్నారు. మండలి బుద్ద ప్రసాద్ మే 26, 1956లో కృష్ణా జిల్లాలోని నాగాయలంకలో పుట్టారు. ఆయన తండ్రి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు. ఇదిలా ఉండగా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు . 2009లో ఎన్నికల్లో ఓడి పోయారు.
కృష్ణా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పన్నెండేళ్ళ పాటూ పనిచేశారు. 2007 ఏప్రిల్ లో పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. 2012లో ఏపీ అధికార భాషా సంఘం చీఫ్ గా పనిచేశారు. ఆయన ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు చేపట్టారు. ఏపీ విభజనను తట్టుకోలేక రాజీనామా చేశారు. 2014లో టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. ప్రస్తుతం జనసేన పార్టీ నుంచి బరిలో ఉన్నారు.