ఏపీలో రూ. 1.4 లక్షల కోట్లతో స్టీల్ కంపెనీ
అనకాపల్లిలో ఏర్పాటుకు ఆదిత్య మిట్టల్ ఓకే
అమరావతి – ఏపీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఖుష్ కబర్ చెప్పింది. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఏపీ ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అమెరికా పర్యటన పూర్తి చేశారు. అక్కడ పలు కంపెనీల ప్రతినిధులు, సీఈవోలు, చైర్మన్ లు, ఎండీలతో భేటీ అయ్యారు. ఏపీలో పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్బంగా కోరారు.
ఇదిలా ఉండగా ఆదివారం జూమ్ కాల్ లో మాట్లాడారు మంత్రి నారా లోకేష్. ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడి పెట్టాలని ఆర్సెలార్ మిట్టల్ సీఈవో ఆదిత్య మిట్టల్ ను కోరారు. ఈ మేరకు ఆయన వైపు నుంచి సానుకూలంగా స్పందన లభించింది. దీంతో ఏపీకి భారీ ఎత్తున స్టీల్ కంపెనీ త్వరలోనే రాబోతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో రూ. 1.4 లక్షల కోట్లతో ప్రతిపాదిత మొత్తం పెట్టుబడితో 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో సమీకృత స్టీల్ ప్రాజెక్టును స్థాపించనున్నట్లు ప్రకటించారు ఆదిత్యా మిట్టల్.
ఇదిలా ఉండగా ఆర్సెలార్ మిట్టల్, జపాన్ కు చెందిన నిప్పన్ స్టీల్ జాయింట్ వెంచర్ ఇక్కడ స్టీల్ కంపెనీని ఏర్పాటు చేయనుంది. మొత్తంగా ఇవాళ ఏపీకి శుభదినం అని చెప్పక తప్పదు. ఈ కంపెనీ ద్వారా భారీ ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు నారా లోకేష్.