ఐసీసీ చైర్మన్ గా జే షా ఏకగ్రీవం
ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డ్
ముంబై – భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ ) కార్యదర్శి జే షాకు అత్యున్నతమైన పదవి దక్కింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐసీసీ క్రికెట్ పాలకవర్గం చరిత్రలో అత్యంత పిన్న వయస్సు కలిగిన వ్యక్తిగా జే షా చరిత్ర సృష్టించారు. ఆయన ఎన్నికకు ఇంగ్లండ్ తో పాటు ఆస్ట్రేలియా క్రికెట్ సంఘాల డైరెక్టర్లు పూర్తిగా సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు మద్దతు లభించడంతో తన ఎన్నిక లాంఛనంగా మారింది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా గ్రెగ్ బార్కే ఉన్నారు. ఆయన పదవీ కాలం త్వరలో పూర్తి కానుంది. ఇదిలా ఉండగా తాను చైర్మన్ గా మూడోసారి ఉండ కూడదని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఐసీసీ చీఫ్ పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
మొత్తం ఐసీసీలో 16 మంది సభ్యులు కలిగి ఉన్నారు. వీరిలో అత్యధిక శాతం బీసీసీఐ కార్యదర్శి జే షా వైపు మొగ్గు చూపడంతో చైర్మన్ గా ఎంపికకు లైన్ క్లియర్ అయ్యింది. ఇదిలా ఉండగా జే షా పదవీ కాలం డిసెంబర్ 1, 2024 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ జే షా ఎవరో కాదు ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా తనయుడు కావడం గమనార్హం.