ఐసీసీ చైర్మన్ రేసులో జే షా..!
గ్రెగ్ బార్కే పదవీ కాలం పూర్తి
హైదరాబాద్ – భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శిగా ఉన్న జే షా త్వరలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ కాబోతున్నారా. అవుననే ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే జే షా అత్యంత బలమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ప్రపంచ క్రికెట్ ను శాసిస్తోంది బీసీసీఐ. వరల్డ్ లోనే అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా గుర్తింపు పొందింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. దాని వార్షిక ఆదాయం రూ. 5,000 కోట్లు దాటిందంటే అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గా గ్రెగ్ బార్కే కొనసాగుతున్నారు. ఆయన పదవీ కాలం వచ్చే నవంబర్ నాటితో ముగియనుంది. దీంతో ఎవరు తదుపరి చైర్మన్ అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జే షా బీసీసీఐ కార్యదర్శితో పాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్ గా ఉన్నారు.
ప్రస్తుతం ఎక్కువ మంది సభ్యుల మద్దతు జే షాకు ఉన్నట్టు సమాచారం. ఓటింగ్ లో మొత్తం 16 మంది సభ్యులు ఉన్నారు. అత్యధిక శాతం సభ్యులు పూర్తిగా జే షాకు చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు టాక్. ప్రధానంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తరపు ప్రతినిధుల మద్దతు కూడా ఆయనకే ఉండడంతో ఇక చైర్మన్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే ఐసీసీ చైర్మన్ గా ఒకవేళ జే షా ఎన్నికైతే కేవలం 35 ఏళ్లు కలిగిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రలో నిలిచి పోతారు .