ఏపీలో బీజేపీ కూటమికి జేపీ మద్దతు
సంచలన ప్రకటన చేసిన లోక్ సత్తా చీఫ్
అమరావతి – లోక్ సత్తా పార్టీ చీఫ్ జయప్రకాశ్ నారాయణ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన సభతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 175 సీట్లతో పాటు 25 ఎంపీ సీట్లకు జరిగే ఎన్నికల్లో ఈసారి తమ పార్టీ పూర్తిగా నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాను ఈ విషయాన్ని ప్రకటించడం జరిగిందని చెప్పారు. జయప్రకాశ్ నారాయణ్ మీడియాతో మాట్లాడారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ, మోదీ సారథ్యంలోని బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ తరుణంలో మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్లనున్నాయి.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఈసారి ఎక్కువగా గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు జేపీ. ఓటు అన్నది వజ్రాయుధమని, దానిని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినియోగించు కోవాలని పిలుపునిచ్చారు. తమ కోసం పని చేసే వారిని గుర్తించి ఎన్నుకోవాలని సూచించారు . సంక్షేమం, అభృద్ధి సమ తూకం పాటించాలని, ఆర్థిక భవిష్యత్తు కాపాడే వారు ఎవరనేది ఆలోచించాలని అన్నారు లోక్ సత్తా చీఫ్.