విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు
జై పార్టీ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ
విశాఖపట్టణం – విశాఖ ఉక్కు కార్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు జై భారత్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీ నారాయణ. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. విశాఖకు స్టీల్ ప్లాంటు తలమానికంగా ఉందన్నారు. దాని గురించి ఎవరైనా ప్రైవేట్ పరం చేయాలని ఆలోచించినా ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కావాలని ఉక్కు పరిశ్రమపై రాజకీయాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ సరైన సమయం ఆసన్నమైందన్నారు. ప్రధాన పార్టీలన్నీ ఒక వైపు జై భారత్ మరో వైపు నిలబడి ఉందన్నారు. ఈసారైనా విశాఖ వాసులు తమ విలువైన ఓటును ఆలోచించి వేయాలని కోరారు.
వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమ ద్వారా ఉపయోగం కలుగుతోందన్నారు. బడా బాబులకు లబ్ది చేకూర్చేలా పీఎం మోదీ, సీఎం జగన్ వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. దీనిని తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేస్తామని ప్రకటించారు జేడీ లక్ష్మీ నారాయణ.