నిప్పులు చెరిగిన జేడీ లక్ష్మీ నారాయణ
విజయవాడ – జై భారత్ పార్టీ చీఫ్ జేడీ లక్ష్మీ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం కేంద్ర సర్కార్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ఏపీకి అన్యాయం చేసిందని ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం గురించి ఎందుకు ప్రస్తావించ లేదని ప్రశ్నించారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి అన్యాయం చేసిందని వాపోయారు. విభజన వల్ల గాయపడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి, ఈ బడ్జెట్ వల్ల ఒనగూరింది ఏమీ లేదన్నారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచినా, ఇంకా బీదరికంపై స్కీములు పెట్టే స్థాయిలో కేంద్ర బడ్జెట్ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
జన్ ధన్ అకౌంట్లలో 34 లక్షల కోట్లు వేశామని కేంద్ర మంత్రి చెపుతున్నారని, అలా డబ్బు వేస్తే, స్వయం సమృద్ధి, ఉపాధి లభించినట్లా? అభివృద్ధి జరిగినట్లా? అని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ ఇన్ రికార్డు టైమ్…అని కేంద్ర మంత్రి ప్రస్తావించారని, ఇక్కడ ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందనే విషయం మరిచారని విమర్శించారు.
తమ మ్యానిఫెస్టో పొందుపరిచిన పలు అంశాలను కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించడాన్ని ఆయన స్వాగతించారు. సోలార్ ఎనర్జీ, రూఫ్ టాప్ ప్లాన్ లో భాగంగా, 300 యూనిట ఫ్రీ ఎలక్ట్రిసిటీ వచ్చేలా , కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ ఇస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
కుల మతాలకు అతీతంగా ఆధ్యాత్మ టూరిజం, కల్చరల్ ఎకో, హెల్త్, మెడికల్, సినిమా, అడ్వెంచర్ స్పోర్ట్స్, కోస్టల్ టూరిజం అభివృద్ధి చేయాలని సంకల్పించామన్నారు. తీర ప్రాంతంలో కాకినాడ, మచిలీపట్నం, విశాఖ, నెల్లూరు టు అండమాన్ క్రూయిజ్ లు కూడా ప్రతిపాదించామని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.