ఏపీకి జగన్..బాబు అన్యాయం
జై భారత్ పార్టీ చీఫ్ వీవీ లక్ష్మీనారాయణ
అమరావతి -చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి వల్ల ఏపీ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు జై భారత్ పార్టీ చీఫ్ వీవీ లక్ష్మీ నారాయణ. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్ల పాటు చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు అవకాశం ఇస్తే రాజధాని పేరుతో రాజకీయం చేశారే తప్పా ప్రజల సమస్యలను పట్టించు కోలేదని ఆరోపించారు.
ఇక నవ రత్నాల పేరుతో జగన్ మోహన్ రెడ్డి పవర్ లోకి వచ్చినా ఒరిగింది ఏమీ లేదని పేర్కొన్నారు. ప్రజలలో కొనుగోలు శక్తి పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. పరిశ్రమలు రాలేదని వాపోయారు. ప్రత్యేకించి ప్రత్యేక హోదా విషయంలో మాజీ సీఎం బాబు, ప్రస్తుత సీఎం జగన్ పూర్తిగా విఫలం అయ్యారంటూ మండిపడ్డారు వీవీ లక్ష్మీ నారాయణ.
కేంద్రంలో మోదీకి గులాంగిరీ చేశారే తప్పా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏనాడూ ఆలోచించిన పాపాన పోలేదని, ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదని మండిపడ్డారు జై భారత్ పార్టీ చీఫ్. ఇంకో వైపు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ధారదత్తం చేసే పనిలో పడ్డారని దానిని అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.