ఏర్పాట్లు పూర్తి చేయాలని జేఈవో ఆదేశం
తిరుపతి – ఈనెల 28వ తేది నిర్వహించనున్న టీటీడీ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ( టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంకు) ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ జేఈఓ (విద్య, ఆరోగ్యం) గౌతమి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలో సంబంధిత అధికారులతో జేఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఈవో గౌతమి మాట్లాడుతూ తిరుమలలోని ఎస్వీ హైస్కూల్, తిరుపతిలోని ఎస్.జీ.ఎస్.హైస్కూల్ లో ఎన్నికల కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుమలలో పని చేసే ఉద్యోగులు ఎస్వీ హైస్కూల్ లో, తిరుపతి, ఇతర ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులు ఎస్.జీ.ఎస్ హైస్కూల్ లో ఓటు హక్కు వినియోగించు కోవాలని సూచించారు.
దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రత్యేక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటు హక్కు వినియోగించు కోవచ్చని చెప్పారు. ఓటు వేసేందుకు వచ్చే ప్రతి ఉద్యోగి తమ ఒరిజినల్ ఐడీ కార్డు తప్పనిసరిగా తీసుకు రావాలని అన్నారు. ఎన్నికల కేంద్రంలోకి సెల్ ఫోన్లు అనుమతించ బడవనీ, సెల్ ఫోన్ల డిపాజిట్ కు ప్రత్యేక డిపాజిట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు గౌతమి.
అదే విధంగా విద్యుత్ శాఖ అధికారులు జనరేటర్లు, మైకులను అందుబాటులో ఉంచుకుని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. విజిలెన్స్ విభాగం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని సెక్యూరిటీ గార్డులతో పాటు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. అలాగే టీటీడీ ఐటీ విభాగం, ఇంజినీరింగ్, సెక్యూరిటీ విభాగాలకు తమ విధులపై దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ అధికారి లక్ష్మి, ఎన్నికల అధికారి ఉమాపతి, ఝాన్సీ, వారి సిబ్బంది ,టీటీడీ వెల్ఫేర్ అధికారి ఆనందరాజు, ఎస్ఈలు మనోహరం, వేంకటేశ్వరులు, వీజీఓ సదాలక్ష్మి, హెల్త్ ఆఫీసర్ ఆశాలత, సీఎంవో డాక్టర్ నర్మద, తదితరులు పాల్గొన్నారు.