కార్తీక మహా దీపోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
టిటిడి జేఈవో వి.వీరబ్రహ్మం
తిరుపతి – తిరుపతి లోని టీటీడీ పరిపాలనా భవనం పరేడ్ మైదానంలో నవంబరు 18వ తేదీ రాత్రి నిర్వహించనున్న కార్తీక మహా దీపోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ కర్తల మండలి (టీటీడీ) ఏర్పాట్లు చేపట్టనున్నట్లు టిటిడి జేఈవో వి.వీరబ్రహ్మం తెలిపారు.
టీటీడీ పరిపాలనా భవనంలోని జేఈవో ఛాంబర్ లో సంబంధిత ఉన్నతాధికారులతో ఆయన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ హెచ్ డీపీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక మహా దీపోత్సవానికి భక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి రాలేని భక్తులు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించాలని సూచించారు.
ఇందులో భాగంగా మహిళలు కూర్చుని దీపాలు వెలిగించేలా దీపపు దిమ్మెలు, నేతి వత్తులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మైదానం మొత్తం తివాచీలు, ఒక్కో దీపపు దిమ్మె వద్ద తులసి మొక్కను ఉంచుతామని చెప్పారు. ఈ. కార్యక్రమం అనంతరం మహిళలకు ఈ మొక్కలను అందజేస్తామని వెల్లడించారు జేఈవో వి. వీరబ్రహ్మం.
వేదికను శోభాయమానంగా పుష్పాలతో, విద్యుత్ దీపాలు, వేదిక ఇరువైపులా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సెట్టింగ్ లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న శ్రీ మహాలక్ష్మీ పూజకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. టిటిడి పరిపాలనా భవనం ప్రధాన ద్వారాల నుంచి ఆవరణం మొత్తం అరటి చెట్లు, పూలు, విద్యుద్దీపాలతో అలంకరించనున్నారు. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మైదానంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు.
ఉన్నతాధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో హెచ్ డిపిపి సెక్రటరీ రఘునాథ్, ప్రొగ్రాం ఆఫీసర్ రాజగోపాల్, అడిషనల్ సెక్రటరీ రాంగోపాల్, ఎస్ఈ (ఎలక్ట్రికల్) వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.