Tuesday, April 22, 2025
HomeDEVOTIONALపంచ‌మి తీర్థానికి విస్తృత ఏర్పాట్లు

పంచ‌మి తీర్థానికి విస్తృత ఏర్పాట్లు

టీటీడీ⁠ ⁠జెఈవో శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాల చివ‌రిరోజైన‌ డిసెంబ‌రు 6న పంచ‌మి తీర్థానికి విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉండ‌డంతో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ జెఈవో వీరబ్రహ్మం తెలిపారు.

తిరుచానూరులోని పద్మ సరోవరంకు నాలుగు వైపులా పంచ‌మి తీర్థం ఏర్పాట్ల‌ను టీటీడీ అధికారులతో కలిసి జెఈవో మంగళవారం త‌నిఖీ చేశారు.

అదే విధంగా పుష్క‌రిణిలో గేట్లు, పంచ‌మితీర్థ మండ‌పాన్ని ప‌రిశీలించారు. భ‌క్తులు ఇబ్బందులు ప‌డ‌కుండా పుష్క‌రిణిలోనికి ప్ర‌వేశించేందుకు, తిరిగి బ‌య‌ట‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. పుష్కర స్నానం అనంతరం భక్తులు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన షేడ్లను పరిశీలించారు.

ముందుగా నవ జీవన్ కంటి ఆసుపత్రి వద్ద, తోళ్ళ‌ప్ప గార్డ‌న్స్‌లో, ఎస్వీ హైస్కూల్, పూడి రోడ్డులో హోల్డింగ్ పాయింట్లును టిటిడిలోని వివిధ విభాగాల అధికారులతో కలసి పరిశీలించారు.

అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడుతూ, పంచ‌మి తీర్థానికి వ‌చ్చే భ‌క్తుల ర‌ద్దీని క్ర‌మ‌బ‌ద్ధీక‌రించేందుకు ప‌టిష్టంగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేశామ‌న్నారు. భ‌క్తుల కోసం 120 అన్న ప్ర‌సాదం కౌంట‌ర్లు, ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు.

అదేవిధంగా క్యూలైన్ల‌లోని భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన తాగునీరు, అల్పాహ‌రం, అన్న ప్ర‌సాదాలు, మ‌జ్జిగ‌ పంపిణీ చేస్తామన్నారు.

5వ తేదీ సాయంత్రం నుండి హోల్డింగ్ పాయింట్ల‌లోనికి భక్తులను అనుమతిస్తామని, డిసెంబ‌రు 6వ తేదీ ఉద‌యం వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, బాదం పాలు అందిస్తామన్నారు.

హోల్డింగ్ పాయింట్లలో ఉన్న భక్తులు వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్లు, శాశ్వ‌త, తాత్కాలిక, మొబైల్‌ మ‌రుగు దొడ్లు, సూచిక బోర్డులు, ప్రథమ చికిత్స కేంద్రాలు, మే ఐ హెల్ప్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఇందుకు అవ‌స‌ర‌మైన 600 మంది అద‌న‌పు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. దాదాపు 1000 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించనున్నట్లు తెలిపారు.

పంచమి తీర్థం మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది, కావున హోల్డింగ్ పాయింట్లలో ఉన్న భక్తులను 11 గంటల నుండి విడ‌త‌ల వారీగా పుష్క‌రిణిలోకి అనుమ‌తిస్తామ‌ని చెప్పారు.

పంచ‌మి తీర్థం ప్ర‌భావం రోజంతా ఉంటుంద‌ని, భ‌క్తులు సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించి పుణ్య‌స్నానాలు ఆచ‌రించాల‌ని కోరారు.

ఈ స‌మావేశంలో ఎఫ్ ఎ అండ్ సీఎవో బాలాజీ, సీఈ సత్యనారాయణ, ఎస్ఈ జగదీశ్వర్ రెడ్డి, ఎస్ఇ (ఎల‌క్ట్రిక‌ల్స్‌) వేంక‌టేశ్వ‌ర్లు, అన్నప్రసాదం స్పెషల్ ఆఫీసర్ శాస్త్రీ, వీజీవో సదాలక్ష్మి, ఏవీఎస్వో సతీష్ కుమార్ అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments