తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ రూ. కోటి విరాళం
వరద బాధితుల కోసం ప్రకటించిన నటుడు
హైదరాబాద్ – తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మానవతను చాటుకున్నారు. వాయవ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను అతలాకుతలం చేశాయి.
ఇప్పటి వరకు భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ సందర్బంగా విపత్తు నుంచి ఆదుకునేందుకు గాను జూనియర్ ఎన్టీఆర్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఏపీకి రూ 50 లక్షలు, తెలంగాణ రాష్ట్రానికి రూ. 50 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కోటి రూపాయలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్లు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సందర్భంగా నటుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుతున్న వరద భీభత్సం తనను ఎంతగానో కలచి వేసిందని పేర్కొన్నారు. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఈ విరాళం అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు.