ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రతి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మకమైన దాశరథి రంగాచార్య సాహిత్య పురస్కారం ఈ ఏడాది 2024కు గాను ప్రముఖ కవి, రచయిత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన జూకంటి జగన్నాథంకు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
కవిగా , రచయితగా పేరు పొందిన జగన్నాథం ప్రజల గొంతుకను వినిపిస్తూ వచ్చారు. కవిత్వంతో కరచాలనం చేసిన ఆయన తన కలాన్ని చైతన్యవంతం చేసే దిశగా ఝులిపించారు. ఇదిలా ఉండగా దాశరథి అవార్డు ఎంపిక కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర సర్కార్.
కమిటీ చేసిన సూచనల మేరకు జూకంటిని ఎంపిక చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులలో స్పష్టం చేసింది. అవార్డు కింద జగన్నాథంకు రూ. 1 లక్షా 1,116 నగదుతో పాటు జ్ఞాపికను అందజేస్తుంది. ప్రతిష్టాత్మకమైన దాశరథి అవార్డును పొందినందుకు కవి, రచయితను అభినందించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.