సీజేఐగా కొలువు తీరిన జస్టిస్ సంజీవ్ ఖన్నా
ప్రమాణ స్వీకారం చేయించిన ద్రౌపది ముర్ము
ఢిల్లీ – భారత దేశ సర్వోన్నత 51వ ప్రధాన న్యాయమూర్తిగా కొలువు తీరారు జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఇప్పటి వరకు సీజేఐగా ఉన్న జస్టిస్ డీవై ఎన్ చంద్రచూడ్ పదవీ విరమణ పొందారు. ఆయనతో సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.
ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేయడం, ఈవీఎంల పవిత్రత, ఆర్టికల్ 370 రద్దు వంటి పలు కీలకమైన సుప్రీంకోర్టు తీర్పుల్లో భాగంగా ఉన్నారు జస్టిస్ సంజీవ్ ఖన్నా. కాగా ఆయన పదవీ కాలం మే 13, 2025 వరకు మాత్రమే ఉంటుంది.
జస్టిస్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దేవ్ రాజ్ ఖన్నా కుమారుడు కావడం విశేషం. అంతే కాదు దేశ న్యాయ వ్యవస్థలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన జస్టిస్ హెచ్ ఆర్ ఖన్నా మేనల్లుడు.
ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కుల రద్దును సమర్థిస్తూ రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన మెజారిటీ తీర్పు న్యాయ వ్యవస్థకు “బ్లాక్ స్పాట్”గా పరిగణించ బడింది. జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నా ఈ చర్యను రాజ్యాంగ విరుద్ధమని, చట్ట నియమాలకు విరుద్ధమని ప్రకటించారు . అప్పటి కేంద్ర ప్రభుత్వం అతనిని తీసివేసింది. ఆయన స్థానంలో జస్టిస్ ఎంహెచ్ బేగ్‌ను సీజేఐగా నియమించింది.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్, మాజీ సీజేఐ జస్టిస్ డీవై ఎన్ చంద్రచూడ్ హాజరయ్యారు.