400 మందిని మిలియనర్లను చేశాడు
హైదరాబాద్ – కోట్లున్నా కొందరు పక్క వారికి అన్నం పెట్టరు. తమ కోసం పని చేస్తున్న ఉద్యోగుల బాగోగులు పట్టించుకోరు. ఎప్పుడెప్పుడు కాస్ట్ కటింగ్ పేరుతో వదిలించు కోవాలని దిగ్గజ కంపెనీలు ఆలోచన చేస్తున్న ప్రస్తుత తరుణంలో తను మాత్రం ఏకంగా తన కోసం పని చేస్తున్న వారిని మిలియనీర్లుగా మార్చేశాడు. అతడు ఎవరో కాదు ప్రవాస భారతీయుడు. రాజస్థాన్ కు చెందిన జ్యోతి బన్సాల్. వయసు 47 ఏళ్లు. మరి తను ఏం చేశాడు. ఎలా ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారాడంటే ఈ కథ చదివి తీరాల్సిందే. తన కంపెనీలో పని చేస్తున్న 400 మంది ఉద్యోగులను మిలియనీర్లుగా మార్చేశాడు. ఎందుకంటే తన ఉన్నతికి కారణమైంది మీరే. మీరు లేక పోతే నేను లేను. ఈ సంపద మీది. ఇందులో మీకూ భాగం ఉందని ప్రకటించాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా తను ఎక్స్ పర్ట్. మారుతున్న ప్రపంచ గమనాన్ని నిశితంగా పరిశీలించాడు. నాలుగు కంపెనీలను స్థాపించాడు.
యాప్ డైనమిక్స్ అనే పేరుతో స్థాపించిన కంపెనీని ప్రపంచంలోనే అత్యంత పేరు పొందిన సిస్కో కంపెనీ ఏరి కోరి ఎంచుకుంది. ఎవరూ ఊహించని రీతిలో కొనుగోలు చేసింది. ఇదే సమయంలో ఇంకొకరైతే ఎగిరి గంతేస్తారు. వచ్చిన డబ్బులన్నీ తన ఖాతాలో వేసుకుంటారు. కానీ జ్యోతి బన్సాల్ అలా చేయలేదు. కంపెనీ ఎదుగుదలకు కారకులైన వారిని గుర్తు పెట్టుకున్నాడు. తనతో పాటు వారికీ కూడా వాటా పంచాడు. దీంతో ఉన్న పళంగా, యాప్ డైనమిక్స్ లో పని చేస్తున్న వారంతా ఒకే ఒక్క రోజులో మిలియనీర్స్ గా మారి పోయారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా జ్యోతి బన్సాల్ వైరల్ గా మారాడు. తను ఢిల్లీ ఐఐటీలో చదివాడు. అమెరికాలో ఉంటున్నాడు. ఏప్రిల్ 2008లో తొలిసారిగా కంపెనీని స్థాపించాడు. 2015 దాకా సీఈఓగా పని చేశాడు. దీనిని సిస్కో సిస్టమ్స్ 3.7 బిలియన్లకు కొనుగోలు చేసింది. ఇది రికార్డ్ ధర.
యాప్ డైనమిక్స్ తో పాటు మరో మూడు కంపెనీలను స్థాపించాడు. తండ్రి వ్యవసాయ పరికరాలను అమ్మే వ్యాపారి. 2000లో జ్యోతి బన్సాల్ సిలికాన్ వ్యాలీలో టెక్నాలజీ పరిశ్రమలో పని చేసేందుకు వెళ్లాడు. అక్కడ స్టార్ట్ అప్ ల కోసం పని చేశాడు . అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ మేనేజ్ మెంట్ కంపెనీని ఏర్పాటు చేశాడు. జూన్ 2016లో జ్యోతి బన్సాల్ ఎర్నెస్ట్..యంగ్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందారు. 2017లో బిగ్ ల్యాబ్స్ పేరుతో స్టార్ట్ అప్ స్టూడియోను ప్రారంభించాడు. హార్నెస్ ని స్టార్ట్ చేశాడు జూలై 2020లో. అధునాతన సైబర్ దాడులకు వ్యతిరేకంగా సాఫ్ట్ వేర్ కోడ్ ను రక్షించే పరికరాలను అందించే సైబర్ సెక్యూరిటీ కంపెనీ ట్రేస్ బుల్ ను ప్రారంభించాడు. జ్యోతి బన్సల్ , జాన్ వ్రియోనిస్ తో కలిసి సీడ్ ఫండ్ ను ఏర్పాటు చేశాడు. లాభాపేక్ష లేని సంస్థలతో భాగస్వామ్యం పంచు కోవడం, స్టార్ట్ అప్ లకు తన సాయం అందించడం, ప్రతిభ కలిగిన వారిని గుర్తించి ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాడు జ్యోతి బన్సాల్. జీవితం అంటే సంపాదించడమే కాదు పదుగురికి పంచడం అని నమ్మిన ఈ టెక్కీ మరింతగా ఎదగాలని ఆశిద్దాం.