పన్నుల మోత ప్రజలకు వాత
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై
తమిళనాడు – భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కుప్పు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన డీఎంకే సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే ఆస్తి పన్ను, కరెంటు చార్జీలు, తాగు నీటి చార్జీలు, పాల ధరలు, బాండ్ల రిజిస్ట్రేషన్ ఫీజులను అనేక రెట్లు పెంచిందన్నారు. తట్టుకోలేక ప్రజలు నానా తంటాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కె. అన్నామలై.
డీఎంకే ప్రభుత్వం గత 2023-2024 ఆర్థిక సంవత్సరంలోనే రూ.65,000 కోట్ల విలువైన విద్యుత్‌ను కొనుగోలు చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో విద్యుత్ ఉత్పత్తి పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకోకుండానే ఈ విద్యుత్ ఖర్చును ప్రజలపై మోపారని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు పలు రాష్ట్రాలు చర్యలు చేపట్టగా, డీఎంకే నెలకు దాదాపు రూ.5,400 కోట్లు ఖర్చు చేసి విద్యుత్ కొనుగోలు చేయడంలో ఉన్న మతలబు ఏమిటని ప్రశ్నించారు.
తమ పరిపాలనా అసమర్థతకు ప్రజలను బలి పశువులను చేస్తున్న డీఎంకే తక్షణమే ఈ విద్యుత్ ఛార్జీల పెంపును ఉపసంహరించు కోవాలని, సోలార్ విద్యుత్ ఉత్పత్తితో సహా విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కె. అన్నామలై.