హామీల పేరుతో డీఎంకే దగా
బీజేపీ చీఫ్ కె. అన్నామలై
తమిళనాడు – భారతీయ జనతా పార్టీ చీఫ్ కె. అన్నామలై నిప్పులు చెరిగారు. తమిళనాడులో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటడం ఖాయమని జోష్యం చెప్పారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ పెరంబుదూరులో పర్యటించారు. ఈ సందర్భంగా కె. అన్నామలై మీడియాతో మాట్లాడారు.
ప్రజలకు ఏం కావాలో తెలుసన్నారు. వారు గంప గుత్తగా సమర్థవంతమైన పాలనతో పాటు నాయకత్వ పటిమ కలిగిన ప్రధాన మంత్రి మోదీని కోరుకుంటున్నారని చెప్పారు. 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 295 వాగ్ధానాలను అమలు చేయడం జరిగిందన్నారు.
అదే డీఎంకే ఎన్నికల సందర్బంగా 511 హామీలు ఇచ్చిందని వాటిలో 20 కూడా అమలు చేసిన పాపాన పోలేదన్నారు కె. అన్నామలై. సీఎం ఎంకే స్టాలిన్ ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారంటూ నిలదీశారు.
ఆయన చెప్పేవన్నీ అబద్దాలేనంటూ మండిపడ్డారు. డీఎంకేకు అంత సీన్ లేదన్నారు. తమ పార్టీకి మొత్తం సీట్లు వస్తాయని, క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని జోష్యం చెప్పారు కె. అన్నామలై.