గంజాయికి రాజధానిగా తమిళనాడు
బీజేపీ చీఫ్ కె. అన్నామలై కామెంట్
తమిళనాడు – రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్ కె. అన్నామలై కుప్పు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో గంజాయి ఎక్కువగా చెలామణి అవుతోందన్నారు. దీని వల్ల అత్యధికంగా నేరాలు జరుగుతున్నాయని , అయినా ఇంత జరుగుతున్నా సీఎం స్టాలిన్ సారథ్యంలోని ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు.
గంజాయి వ్యాపారులు పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారని, మత్తులో ఉన్న యువకులు ప్రభుత్వ బస్సు డ్రైవర్ పై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు భార్య, మామలపై ఓ వ్యక్తి దాడికి పాల్పడినట్లు కూడా సమాచారం వచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు కె. అన్నామలై కుప్పు స్వామి.
నేరం జరిగిన తర్వాత నేరస్తులను పట్టుకునేందుకు ముందుకు వచ్చే పోలీసులకు గంజాయి వ్యాపారులు, విక్రయదారులు ఎవరో తెలియదా? గంజాయి చెలామణిని పూర్తిగా ఎందుకు ఆపలేక పోతున్నారని ప్రశ్నించారు బీజేపీ చీఫ్.
మొత్తంగా ఈ వ్యవహారంపై సర్కార్ మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు కె. అన్నామలై.