నా జీవితం కాంగ్రెస్ మయం
55 ఏళ్ల పాటు ఆ పార్టీలో ఉన్నా
హైదరాబాద్ – బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు సీనియర్ నాయకుడు , రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు. శుక్రవారం ఆయన తన కూతురు మేయర్ గద్వాల విజయ లక్ష్మితో కలిసి సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నివాసంలో కలుసుకున్నారు. అనంతరం కె. కేశవరావు మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
బీఆర్ఎస్ ను వీడాలని నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇచ్చిందన్నారు. దాదాపు తన రాజకీయ జీవితంలో అత్యధిక కాలం 55 ఏళ్ల పాటు పార్టీలో కొనసాగానని స్పష్టం చేశారు. ఈ దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ తనకు ఎంతో విలువ ఇచ్చారని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. 13 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నానని, ఇది చారిత్రిక తప్పిదమన్నారు. ఏది ఏమైనా పార్టీ తనను తిరిగి రావాలంటూ కోరిందని తెలిపారు. అందుకే మనసు మార్చుకున్నానని ,ఈ మేరకు గులాబీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు కేశవరావు.