కేసీఆర్ నా మాట కాదన లేదు
కే కేశవరావు షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రాజ్య సభ సభ్యుడు కె. కేశవరావు తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన హుటా హుటిన తన కూతురు , మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి సీఎం ఎనుముల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తన 85 ఏళ్ల జీవిత కాలంలో అత్యధిక సంవత్సరాలు కాంగ్రెస్ తోనే ఉన్నానని చెప్పారు. 55 ఏళ్ల పాటు ఎన్నో పదవులు అనుభవించానని అన్నారు.
అనుకోని పరిస్థితుల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీని వీడడం జరిగిందన్నారు. 10 ఏళ్లకు పైగా బీఆర్ఎస్ లో కీలకమైన పదవిలో ఉన్నానని, తనకు అత్యంత గౌరవం ఇచ్చారని కేసీఆర్ పట్ల సానుకూలంగా మాట్లాడారు కే. కేశవరావు.
ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా ముందుగా తనను ఆదరించి, అక్కున చేర్చుకుని అత్యున్నత పదవిలో కూర్చో బెట్టినందుకు గాను కృతజ్ఞతగా కేసీఆర్ కు చెప్పి వచ్చానని స్పష్టం చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి నాయకుడికి ఉండాల్సిన లక్షణమన్నారు. రాజకీయాలలో నేతలు పార్టీలు మారడం సర్వ సాధారణమని పేర్కొన్నారు కె. కేశవరావు.