విశాఖ నుంచి కేఏ పాల్ పోటీ
ప్రకటించిన ప్రజాశాంతి పార్టీ చీఫ్
విశాఖపట్నం – ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ సంచలన ప్రకటన చేశారు. తాను త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. విశాఖ పట్టణం నుంచే తాను లోక్ సభ సభ్యుడిగా బరిలో నిలుస్తానని స్పష్టం చేశారు .
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి పురందేశ్వరి అంతా ఒక్కటేనని ఎద్దేవా చేశారు. త్వరలోనే ప్రపంచ శాంతి సదస్సు చేపడుతున్నట్లు చెప్పారు. తనకు సాయం చేయమని సీఎం రేవంత్ రెడ్డి కోరారని అందుకే ప్రపంచ శాంతి దూతగా తాను రాష్ట్రం మేలుకోరి ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
ఏపీలో ఎవరికి ఓటు వేసినా అది భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్లేనని, ఈ విషయాన్ని గమనించి తమ విలువైన ఓటును వాడుకోవాలని సూచించారు డాక్టర్ కేఏ పాల్. ఏ ఒక్కరు కూడా రాష్ట్ర అభివృద్ది గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ ధ్వజమెత్తారు. ఈసారి తనను గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. విశాఖ ఉక్కు ప్రజల హక్కు అని దానిని విస్మరించే ప్రయత్నం చేస్తుండడం దారుణమన్నారు.