కాంగ్రెస్ ఆహ్వానం కడియం సంతోషం
పార్టీ లో చేరికపై త్వరలోనే చెబుతా
హైదరాబాద్ – మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఏఐసీసీ నుంచి , టీపీసీసీ నుంచి పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం అందిందని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
భవిష్యత్తులో మంచి స్థానం ఉంటుందని, తమతో కలిసి ముందుకు రావాలని కోరారని ఆ మేరకు తాను ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని , కొంత సమయం ఇవ్వమని కోరడం జరిగిందన్నారు కడియం శ్రీహరి. ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులంతా తనకు కావాల్సిన వాళ్లేనని అన్నారు. తన లాంటి అనుభవం కలిగిన నేతలు రావడం వల్ల పార్టీకి మరింత బలం చేకూరినట్లవుతుందని చెప్పారని తెలిపారు.
తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న నిర్ణయంపై త్వరలోనే స్టేషన్ ఘణపూర్ శాసన సభ నియోజకవర్గం నేతలు, కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు, శ్రేయోభిలాషులతో కలిసి సమావేశం అవుతానని, ఆ తర్వాత వారి నిర్ణయం మేరకు తాను చేరాలా వద్దా అన్న విషయంపై తుది నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు కడియం శ్రీహరి.