ట్రంప్ మనవరాలు కై ట్రంప్ వైరల్
అద్బుతమైన ప్రసంగంతో ఫిదా
అమెరికా – ఎవరీ కై ట్రంప్ అనుకుంటున్నారా. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల మనవరాలు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తన అద్భుతమైన ప్రసంగంతో ఆకట్టుకున్నారు..వైరల్ గా మారారు. ప్రస్తుతం నెట్టింట్లో సెన్సేషన్ గా నిలిచారు కై ట్రంప్. ఆమె వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే. ఆమె డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూతురు. ఆమె రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ లో మాట్లాడారు.
ఆమె ప్రసంగించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా చేసింది. ప్రజలు తరచుగా చూడని తన తాత వైపు పంచుకోవడానికి ఇవాళ మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానని అన్నారు. ట్రంప్ ను మీరు మాజీ అధ్యక్షుడిగా చూస్తారు. కానీ ఆయన తనకు సాధారణంగా తాత మాత్రమేనని చెప్పారు.
మా తల్లిదండ్రులు చూడనప్పుడు తాతయ్య ట్రంప్ మాకు మిఠాయిలు , సోడాలు ఇస్తూ ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నం చేశారని చెప్పారు కై ట్రంప్. ఆయన ఎప్పుడూ పాఠశాలలో ఎలా ఉన్నామో తెలుసు కోవాలని అనుకుంటాడని కితాబు ఇచ్చారు మనవరాలు. నేను చదువుకుంటున్న తీరును చూసి తాతయ్య ట్రంప్ తెగ సంతోషానికి లోనయ్యాడని చెప్పారు కై ట్రంప్.
పాఠశాల ఎలా ఉందంటూ అడుగుతాడు. అంతే కాదు నాకు గోల్ఫ్ అంటే చాలా ఇష్టం. ఆడుతున్నావా అని ఆరా తీస్తాడని చెప్పారు. చాలా మంది మా తాత ట్రంప్ ను ఇబ్బందుల్లో పడేశారని, కానీ ఆయన ఇప్పటికీ ఎప్పటికీ ఎవరికీ భయపడే రకం కాదన్నారు. ఆయన ఎల్లప్పటికీ మాకే కాదు కోట్లాది మందికి స్పూర్తిగా నిలుస్తారని ప్రశంసలు కురిపించారు కై ట్రంప్. అమెరికాను మరింత గొప్ప దేశంగా తీసుకు వెళ్లే సత్తా కలిగిన నాయకుడంటూ పేర్కొన్నారు.