మేం ప్రజా కోర్టుకు వెళుతున్నాం – కైలాష్
సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయంపై మంత్రి
ఢిల్లీ – ఆప్ బాస్, ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తానని ప్రకటించడం పట్ల స్పందించారు ఢిల్లీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్ . ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
అరవింద్ కేజ్రీవాల్ నిజాయితీ మరియు గౌరవం సంపాదించారు, ఆయన ప్రజాకోర్టుకు వెళ్తాడు, నిర్ణయం ప్రజల చేతుల్లో ఉంది అని స్పష్టం చేశారు. మరోసారి ప్రజలు ఎటు వైపు నిలబడతారనేది త్వరలోనే తేలుతుందన్నారు.
2 రోజుల్లో తమ పార్టీ చీఫ్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తారని తెలిపారు. ఇది ఆయన స్వంత నిర్ణయం మాత్రమే కాదని, తామందరం కలిసి తీసుకున్న నిర్ణయమని చెప్పారు.
రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే తాము ముందస్తుగా బరిలో నిలవాలని కోరుకుంటున్నట్లు కైలాష్ గెహ్లాట్ తెలిపారు.
కాగా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. తాను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోనున్నట్లు స్పష్టం చేశారు.
ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. మరో రెండు రోజుల్లో లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి తాను రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఈ కీలక ప్రకటనతో ఒక్కసారిగా ఆప్ లో కలకలం రేపింది. నాయకులు, మంత్రులు, కార్యకర్తలు, అభిమానులు విస్మయానికి లోనయ్యారు. రెండు రోజుల్లోనే తాను రాజీనామా చేస్తానని ప్రకటించడం పట్ల ఆశ్చర్యానికి గురయ్యారు.