కాకాణి గోవర్దన్ రెడ్డి హౌస్ అరెస్ట్
ఎమ్మెల్యే సోమిరెడ్డిపై ఆగ్రహం
అమరావతి – నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్దన్ రెడ్డిని మంగళవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి అవినీతిని బట్టబయలు చేసేందుకు రైతులతో కలిసి కనుపూరు కాలువకు బయలు దేరిన కాకాణిని అడ్డుకున్నారు పోలీసులు.
సోమిరెడ్డి అవినీతి, అక్రమాలకు అంతు లేకుండా పోతోందని.. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతుంటే చూస్తూ ఊరుకుంటామా? అంటూ కాకాణి మండి పడ్డారు.
సోమిరెడ్డి అవినీతిపై పోరాటం కొనసాగుతుంది తప్ప.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు కాకాణి గోవర్దన్ రెడ్డి. ఇలా ఎంత మందిని, ఎంత కాలం అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించారు. తాము దాడులు చేసేందుకు వెళ్లడం లేదని, జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించేందుకు, నిలదేసేందుకు మాత్రమే అక్కడికి వెళుతున్నామని ప్రకటించారు.
తాను ఏం చేశానని తనను హౌస్ అరెస్ట్ చేస్తారంటూ నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. రాష్ట్రంలో ఆటవిక, రాచరిక పాలన సాగుతోందని ఆరోపించారు. ఓ వైపు సోమిరెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని, అందినంత మేర దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఆరు నూరైనా సరే అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు కాకాణి .