సోమిరెడ్డికి అంత సీన్ లేదు
మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి
అమరావతి – నెల్లూరు జిల్లాలో రాజకీయం మరింత వేడెక్కింది. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. ఆయనకు అంత సీన్ లేదన్నారు. తనపై , పార్టీపై ఆరోపణలు చేయడాన్ని తప్పు పట్టారు. చేసిన ప్రతి ఆరోపణకు తన వద్ద సరైన సమాధానం ఉందన్నారు. నీకు దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు కాకాణి.
తనను రాజకీయంగా ఎదుర్కోలేక చిల్లర విమర్శలు చేస్తున్నాడంటూ మండిపడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే ఈనాడు పత్రికకు పేపర్ బాయ్ అవతారం ఎత్తాడంటూ సోమిరెడ్డిని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు కాకాణి గోవర్దన్ రెడ్డి.
సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడం, అక్రమ లేఔట్లను ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు..2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లను ప్రోత్సహించారని ఆరోపించారు.
సోమిరెడ్డి అనుచరుడు పొదలకూరు పోలేరమ్మ మాన్యాన్ని ఆక్రమిస్తే స్థానికులు అడ్డుకొని, ఆక్రమణలు తొలగించారని గుర్తు చేశారు. 2019లో బిజెపికి సంబంధించిన వ్యక్తి ఇచ్చిన అర్జీ మీద జిల్లా కలెక్టర్ అక్రమ లేఔట్లపై విచారణకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
పొదలకూరు మండలంలో సోమిరెడ్డి మంత్రిగా వెలగబెట్టిన సమయంలో 40 అక్రమ లేఔట్లు గుర్తించామని అధికారులు కలెక్టర్ నివేదికలు అందజేశారని అన్నారు. విచారణ జరిపి 6 కోట్ల 52 లక్షల 36 వేల 405 రూపాయలు అక్రమ లేఔట్ల యాజమాన్యాల నుండి వసూలు చేయమని మెమో జారీ చేశారన్నారు
సోమిరెడ్డి ధన దాహానికి పంచాయతీ కార్యదర్శులు బలి అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆయన హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు.