డీఎంకేకు కమల్ హాసన్ మద్దతు
మక్కల్ నీది మయ్యం పోటీకి దూరం
తమిళనాడు – రాష్ట్రంలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు శర వేగంగా మారుతున్నాయి. ఇదే సమయంలో ప్రముఖ నటుడు దళపతి విజయ్ కూడా కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన చాప కింద నీరులా గ్రౌండ్ వర్క్ పూర్తి చేసినట్లు కూడా టాక్. ఇది పక్కన పెడితే ఇటీవలే పలుమార్లు దేశ ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటించారు.
దీంతో బీజేపీలో పుల్ జోష్ నెలకొంది. ఆ పార్టీ చీఫ్ కె. అన్నామలై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. పలు సర్వే సంస్థలు సైతం ప్రజలలో మార్పు వస్తోందని, అది బీజేపీకి ఓట్ల రూపంలో లాభించనుందని పేర్కొన్నాయి.
ఈ తరుణంలో అధికారంలో ఉన్న సీఎం ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే పార్టీ ముందస్తుగా జాగ్రత్త పడుతోంది. ఇప్పటికే ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. కాంగ్రెస్ పార్టీతో పాటు తాజాగా ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్ తో చర్చలు జరిపారు యువ నాయకుడు, మంత్రి , సీఎం తనయుడు ఉదయనిధి స్టాలిన్. ఈ మేరకు తాము బరిలో ఉండడం లేదని ప్రకటించారు ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్.
ఇరు పార్టీల నేతలు కమల్, స్టాలిన్ లు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా కమల్ హాసన్ కు రాజ్య సభ టికెట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు సీఎం స్టాలిన్.