సరస్వతీ దేవిగా కనక దుర్గమ్మ దర్శనం
బంగారు వీణతో చదువుల తల్లి సాక్షాత్కారం
విజయవాడ – శరన్నవరాత్రుల్లో భాగంగా 7వ రోజైన బుధవారం (ఆశ్వయుజ శుద్ధ సప్తమి) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చింది. అమ్మ వారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రానికి శరన్నవరాత్రుల్లో ఎంతో విశిష్టత ఉంది.
అందుకే ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు చదువుల తల్లిగా కొలువుదీరే దుర్గమ్మను దర్శించు కునేందుకు భక్తులు పోటెత్తుతారు. త్రిశక్తి స్వరూపిణి నిజ స్వరూపాన్ని సాక్షాత్కారింపజేస్తూ శ్వేత పద్మాన్ని అధిష్టించిన దుర్గామాతా తెలుపు రంగు చీరలో బంగారు వీణ, దండ, కమండలం ధరించి అభయ ముద్రతో సరస్వతీదేవిగా భక్తులను అనుగ్రహించింది.
ఈ రోజున అమ్మ వారికి గారెలు, పూర్ణాలను నైవేద్యంగా భక్తులు ఎత్తున సమర్పించారు. ఎక్కడ చూసినా భక్తులతో ఇంద్రకీలాద్రి సముద్రాన్ని తలపింప చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు . ఇదిలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు ఎస్పీ ఆధ్వర్యంలో.