పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా – కందుల దుర్గేష్
రాష్ట్రానికి సంబఃధించి ప్రత్యేకంగా టూరిజం పాలసీ
విశాఖపట్నం – ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసేందుకు ప్రత్యేకంగా టూరిజం పాలసీని తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ . ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించి వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి కొత్త పాలసీని తీసుకు వస్తామన్నారు.
పర్యాటకులను ఆకర్షించేలా, స్టేక్ హోల్డర్లకు అనుకూలంగా ఉండేలా పాలసీ రూప కల్పన చేస్తామన్నారు కందుల దుర్గేష్. ఏపీ పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహకారం ఉంటుందని దక్షిణాది రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సులో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారని తెలిపారు కందుల దుర్గేష్.
పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడం శుభ పరిణామం అన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా టెంపుల్, ఎకో, అడ్వెంచర్, వెల్ నెస్, అగ్రి టూరిజంలను కలుపుతూ సర్క్యూట్ లు ఏర్పాటు చేస్తామన్నారు.
రాష్ట్రంలో పీపీపీ విధానంలో 5 ప్రాంతాల్లో ఫైవ్ స్టార్ హోటళ్లు ఒబెరాయ్ సంస్థ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు.
రూ.500 కోట్లతో ఏపీకి మెగా ప్రాజెక్టు..అమరావతిలో గోల్ప్ కోర్స్ ఏర్పాటు.. రివర్ ఫ్రంట్ పొడవునా టూరిజం ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. సినిమాలు, లఘు చిత్రాల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రాచుర్యం కల్పిస్తామని చెప్పారు.
జనవరిలో విశాఖ ఉత్సవ్, బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ప్రకటించారు. పర్యాటక అభివృద్ధి కోసం త్వరలో పెట్టుబడిదారులతో కాన్ క్లేవ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తామన్నారు.