అసెంబ్లీలో వెల్లడించిన కందుల దుర్గేష్
అమరావతి – రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిషికొండ ప్యాలెస్ భవన నిర్మాణం గురించి కీలక అంశాలు వెల్లడించారు శాసన సభలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. పలువరు సభ్యులు ఇందుకు సంబంధించిన వివరాలు కావాలని అడిగారు.
విశాఖపట్నం జిల్లా ఎండాడ గ్రామంలో సర్వే నెంబర్ 19 లో రిషికొండ పైన ఉన్నటువంటి 61 ఎకరాల విస్తీర్ణంలో 9 ఎకరాల 88 సెంట్లలో భవనాన్ని నిర్మించారని తెలిపారు. 7 బ్లాక్ లతో ఉన్నటువంటి ఒక రిసార్ట్ ను ఏపీ టీడీసీ వాళ్ళు నిర్మించడం జరిగిందన్నారు.
రిషికొండలో భవనాల నిర్మిత విస్తీర్ణం పరిశీలిస్తే విజయనగరం, కళింగ, గజపతి, వేంగి బ్లాక్ లతో కలిపి మొత్తం ఐదు బ్లాక్ లు ఉన్నాయని తెలిపారు మంత్రి కందుల దుర్గేష్.
ఏ బ్లాక్ లో మళ్ళీ మొత్తం మూడు బ్లాకులు ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని బ్లాక్ ల నిర్మిత విస్తీర్ణం 1,45,765 చదరపు అడుగులు అని.. వీటి కోసం రూ. 222 కోట్ల 92 లక్షలు ఖర్చు అయ్యిందన్నారు .
భవనాలు కాకుండా చేపట్టిన మిగితా పనులు చూస్తే హార్డ్ స్కేపింగ్, స్లో ప్రొటెక్షన్ వర్క్.. వీటన్నింటికీ కలిపి రూ. 186 కోట్ల 47 లక్షలు ఖర్చయినట్లు తెలిపారు. 9 ఎకరాల 88 సెంట్లలో జరిగిన భవనాల నిర్మాణానికి, ఇతర పనులకు సంబంధించి మొత్తంగా రూ. 409 కోట్ల 39 లక్షలు ఖర్చు అయిందన్నారు.
దీనికి సంబంధించి ఒక్కొక్క చదరపు అడుగుకు (ఎస్ఎఫ్టీ కి) రూ. 23,261 ఖర్చు అయినట్లు తెలిపారు మంత్రి కందుల దుర్గేష్. ఇతర అంశాలకు కోసం దాదాపు రూ. 71 కోట్ల 91 లక్షలు ఖర్చు జరిగిందన్నారు.