మోదీపై యుద్దం తప్పదు
కన్హయ్య కుమార్ కామెంట్
న్యూఢిల్లీ – భారత కూటమి ఈశాన్య ఢిల్లీ లోక్ సభ స్థానానికి బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కన్హయ్య కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో మోదీ రాచరిక పాలన సాగిస్తున్నారంటూ ఆరోపించారు. రాబోయే కాలంలో గనుక బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే జనం ఆగమాగం కాక తప్పదని హెచ్చరించారు కన్హయ్య కుమార్.
వ్యవస్థలను సర్వ నాశనం చేసి, దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేసి, ఆర్థిక నేరగాళ్లను బయటకు పంపించేసి , ఉన్న వనరులన్నింటినీ గంప గుత్తగా అంబానీ, అదానీ, టాటా, మహీంద్రాలకు అప్పగించిన మోదీకి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ప్రస్తుతం జరగబోయే ఎన్నికలు న్యాయానికి , అన్యాయానికి మధ్య జరుగుతున్నాయని ఆరోపించారు. కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ఓట్లను కొల్లగొట్టాలని చూస్తున్న మోదీ, బీజేపీ పరివారానికి షాక్ తప్పదన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు కన్హయ్య కుమార్.