కర్ణాటకలో మూడు రోజుల సంతాప దినాలు
మాజీ సీఎం ఎస్ఎం కృష్ణకు ప్రభుత్వ నివాళి
కర్ణాటక – కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి సిద్దరామయ్య. ఈ సందర్బంగా అధికారికంగా మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించినట్లు తెలిపారు. ఇదే సమయంలో గురువారం వరకు శాసన సభను వాయిదా వేసినట్లు వెల్లడించారు. స్వగ్రాహంలో మాజీ ముఖ్యమంత్రి కృష్ణ అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
దేశ వ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నాయకులు ఎస్ఎం కృష్ణ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గొప్ప నాయకుడిని, అరుదైన ఆలోచనాపరుడిని కోల్పోవడం బాధాకరమన్నారు.
దేశంలో బెంగళూరును ఐటీ కేపిటల్ గా మార్చిన ఘనత ఒక్క ఎస్ఎం కృష్ణకే దక్కుతుందని పేర్కొన్నారు పీఎం. ఇదిలా ఉండగా కృష్ణ వయసు 92 ఏళ్లు. మహారాష్ట్ర గవర్నర్ గా, విదేశాంగ శాఖ మంత్రిగా పని చేశారు. బెంగళూరును ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తిగా గుర్తింపు పొందారు ఎస్ఎం కృష్ణ. ఆయన మే 1, 1932లో మాండ్యా జిల్లాలోని సోమనహళ్లిలో పుట్టారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పని చేశారు. చివరి దశలో ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరారు.