సీఎంకు షాక్ విచారణకు గవర్నర్ ఓకే
ముడా కేసులో సిద్దరామయ్య, కుటుంబం
కర్ణాటక – కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు బిగ్ షాక్ తగిలింది. తనపై విచారణ చేపట్టేందుకు రాష్‌ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. దీనిపై కలకలం రేపుతోంది. ఇప్పటికే బీజేపీయేతర రాష్ట్రాలలో గవర్నర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ తరుణంలో తాజాగా కర్నాటక గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. ఇదిలా ఉండగా సిద్దరామయ్య కుటుంబానికి సంబంధించిన ముడా కేసు నడుస్తోంది. ఇందులో ఆయన ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వచ్చాయి.
భారతీయ జనతా పార్టీతో పాటు హెచ్ డి దేవ గౌడ సారథ్యంలోని జేడీఎస్ సంయుక్తంగా భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ముడా కేసుకు సంబంధించి సీబీఐతో విచారణ చేపట్టాలని కోరాయి. ఇదే క్రమంలో ఇద్దరి నుంచి ఫిర్యాదులు వెళ్లాయి గవర్నర్ కు.
ఇందులో ఒకరు ఆర్టీఐ కార్యకర్త కాగా మరొకరు సామాజిక కార్యకర్త టీజే అబ్రహం. ఈ ఇద్దరూ ముడా కేసుపై విచారణ చేపట్టాలని, సీఎం సిద్దరామయ్యతో పాటు ఆయన కుటుంబాన్ని పక్షపాతం లేకుండా విచారణ జరిపించాలని ఫిర్యాదు చేశారు. దీనిపై గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఓకే చెప్పారు. ప్రస్తుతం గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిప్పులు చెరిగింది.