ఘనంగా కృత్తికా దీపోత్సవం
శ్రీ కపిలేశ్వరాలయంలో
తిరుపతి – తిరుపతి శ్రీ కపిలేశ్వర ఆలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని కృత్తికా దీపోత్సవం నిర్వహించారు.
భక్తుల శివనామ స్మరణ-“హర హర మహాదేవ శంభో శంకర” అనే మంత్రోచ్ఛారణల మధ్య “కార్తీక దీపోత్సవం” అత్యంత భక్తి పారవశ్యంతో జరిగింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతం వేగం కూడా పెరిగింది. దీంతో ఆలయంలోని పుష్కరిణి లోనికి భక్తులను అనుమతించ లేదు. ఆలయ ప్రాంగణంలో మహిళలు నెయ్యి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.
సాయంత్రం 6 గంటలకు గర్భాలయంలో, ఆ తరువాత శ్రీకపిలేశ్వర స్వామి వారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజ స్తంభంపైన దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఊంజల్ మండపంలో ఆకట్టుకునేలా శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు. ఆ తరువాత జ్వోలాతోరణం వెలిగించారు.
ఈ కార్యక్రమంలో జేఈవో గౌతమి, వీజీవో సదా లక్ష్మి, డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.