కేసీఆర్ ఫైర్ సర్కార్ పై సెటైర్
గాడి తప్పిన రేవంత్ పాలన
హైదరాబాద్ – మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన గాడి తప్పిందన్నారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యమై పోయాయని, అసలు ఎవరు ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. ఎవరు ఉన్నా లేక పోయినా ప్రభుత్వంపై యుద్దం మాత్రం ఆగదని హెచ్చరించారు.
తెలంగాణ భవన్ లో కేసీఆర్ పార్టీకి చెందిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర సర్కార్ ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ లో కనీసం తెలంగాణ రాష్ట్రానికి చోటు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది మంది కాంగ్రెస్ , మరో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నా ఏ ఒక్కరు నోరు మెదపక పోవడం దారుణమన్నారు.
అదే బీఆర్ఎస్ ను గెలిపించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదా అని ప్రశ్నించారు కేసీఆర్. రాజకీయ కక్ష సాధింపుతోనే తన కూతురు కవితను జైల్లో పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సొంత బిడ్డ జైల్లో ఉంటే బాధ పడకూడదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ సర్కార్ కు కావాల్సినంత టైం ఇచ్చామని ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు కేసీఆర్. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు.