వెల్లడించిన మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్ – పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు పార్టీ తరపున లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు. నందినగర్ లోని తన నివాసంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు కేసీఆర్.
చేవెళ్ల, వరంగల్ పార్లమెంట్ స్థానాల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేశారు బీఆర్ఎస్ బాస్. ఇదిలా ఉండగా రాష్ట్రంలో బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను చేవెళ్ల ఎంపీ సీటుకు ఎంపిక చేశారు.
ఇక వరంగల్ జిల్లా లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కడియం కావ్యను అభ్యర్థినిగా ఖరారు చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తూ పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్.