రైతుల కోసం బీఆర్ఎస్ నిరసన
పిలుపునిచ్చిన బీఆర్ఎస్ బాస్
హైదరాబాద్ – కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త నిరసనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపనిచ్చారు. రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా ఈనెల 16న గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సన్న వడ్ల కు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడం, మోసం చేయడం, దగా చేయడమేనని కేసీఆర్ దుయ్యబట్టారు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ రైతువ్యతిరేక విధానాలను ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఎట్లా ప్రకటిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి వంచించిందని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్.