కేసీఆర్ బంపర్ ఆఫర్
పార్టీ వీడకుంటే భవిష్యత్తు
హైదరాబాద్ – బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఎవరూ కూడా పార్టీని వీడ వద్దని కోరారు. ఆ మేరకు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి పార్టీని వీడకుండా ఉన్న నేతలకు, కార్యకర్తలకు భవిష్యత్తులో మంచి పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు.
పదవులు అనేవి శాశ్వతం కావన్నారు. పార్టీనే ముఖ్యమన్నారు. ఆనాడు తాను ఒక్కడినే ఒంటరి పోరాటం చేశానని, ఎందరో తనను అవహేళన చేశారని గుర్తు చేశారు. కానీ మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళ్లానని, చావు నోట్లో తలకాయ పెట్టి తిరిగి అజేయుడిగా మీ ముందుకు వచ్చానని చెప్పారు.
ఇదే పట్టుదల, పోరాటం, అంకిత భావం పార్టీ పట్ల ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని సూచించారు కేసీఆర్. అందరూ తెలంగాణ రాదని ఎద్దేవా చేశారని, కానీ వాళ్లు తల దించుకునేలా తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ప్రకటించి సాధించి నిరూపించానని అన్నారు కేసీఆర్.
రాజకీయాలలో గెలుపు , ఓటములు సహజమని దీనిని స్పోర్టివ్ గా తీసుకోవాలని అన్నారు. కేవలం ఒకే ఒక్క శాతం తేడాతో మనం అధికారానికి దూరమయ్యామని, ప్రజలు గుడ్డిగా కాంగ్రెస్ మాటలు నమ్మి మోస పోయారని అన్నారు మాజీ సీఎం.