మేడారం ఆత్మ గౌరవానికి ప్రతీక
తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు
హైదరాబాద్ – ప్రపంచంలోనే అతి పెద్ద జాతరగా భావించే మేడారం జాతర ప్రారంభమైంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఆర్టీసీ ఏకంగా 6 వేలకు పైగా బస్సులను ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను మంజూరు చేసింది. మంత్రులు సీతక్క, సురేఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు.
ఇదిలా ఉండగా మేడారం జాతర సందర్బంగా మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల చేత పూజలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
రెండేండ్లకు ఒకసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద అడవిబిడ్డల జాతరగా ,తెలంగాణ కుంభమేళా గా ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో కొనసాగిన ఆత్మ గౌరవ పోరాటంలో, సమ్మక్క సారలమ్మ అందించిన స్ఫూర్తి ఇమిడి వున్నదని కేసీఆర్ తెలిపారు.