దొంగలతో కలిసేటోళ్లను పట్టించుకోం
స్పష్టం చేసిన మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ బాస్ , తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు, ఇతర నేతలపై సీరియస్ కామెంట్స్ చేశారు. పార్టీని వీడి దొంగలతో కలిసేటోళ్ల గురించి తమకు ఎలాంటి బాధ లేదన్నారు.
తెలంగాణ సాధించిన తనకు ఇది ఓ లెక్క కాదన్నారు. దట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళతామని , సరికొత్త నాయకత్వాన్ని తయారు చేస్తానని స్పష్టం చేశారు. పార్టీయే నాయకులను తయారు చేస్తది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరని అన్నారు కేసీఆర్.
నాడైనా నేడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే.. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తదని చెప్పారు మాజీ సీఎం. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామన్నారు.
కాగా.. అంతకు ముందు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యేలు డా. సంజయ్, కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, జాజాల సురేందర్, గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, ఎల్ రమణ, జగిత్యాల జెడ్పీ చైర్మన్ వసంత సురేష్, పెద్దపెల్లి బీఆర్ఎస్ నేత ఉష తదితరులు పాల్గొన్నారు.