ఎమ్మెల్సీని అభినందించిన కేసీఆర్
108 ఓట్ల తేడాతో నవీన్ కుమార్ రెడ్డి గెలుపు
హైదరాబాద్ – పాలమూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందారు భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నవీన్ కుమార్ రెడ్డి. ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 108 ఓట్ల తేడాతో గెలుపొందారు.
ఈ జిల్లాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలిందని చెప్పక తప్పదు. ఇదిలా ఉండగా విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డి మర్యాద పూర్వకంగా మాజీ సీఎం , బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ను కలుసుకున్నారు.
నవీన్ కుమార్ రెడ్డిని ఆలింగనం చేసుకున్నారు కేసీఆర్. ఆయన ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు. ప్రత్యర్థి పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా చివరకు పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ వైపు నిలబడ్డారని, అద్భుతమైన విజయాన్ని కట్ట బెట్టారని కొనియాడారు కేసీఆర్. వారందరికీ పేరు పేరునా అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలోపాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు.. తదితరులు హాజరయ్యారు.