రైతు వ్యతిరేక బడ్జెట్ – కేసీఆర్
అన్ని వర్గాలకు వెన్నుపోటు
హైదరాబాద్ – తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం రాష్ట్ర శాసన సభలో బడ్జెట్ 2024-25 ను ప్రవేశ పెట్టారు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. బడ్జెట్ ప్రవేశ పెట్టడాన్ని స్వాగతిస్తూనే ఇది బడ్జెట్ ప్రసంగంలా లేదని, రాజకీయ ప్రసంగంలా ఉందంటూ ఎద్దేవా చేశారు.
తెలంగాణకు ఆయువు పట్టు వ్యవసాయ రంగమని, దానిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకు తాము న్యాయం చేశామని, రైతు బంధు అమలు చేశామని, కానీ ఆచరణకు నోచుకోని హామీలతో పవర్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ నిట్ట నిలువునా ముంచిందన్నారు.
ఈ బడ్జెట్ పూర్తిగా రైతులకు వ్యతిరేకమైన బడ్జెట్ ను ప్రవేశ పెట్టిందని ధ్వజమెత్తారు కేసీఆర్. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందంటూ కాంగ్రెస్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని తాము ప్రవేశ పెట్టిన పథకాలను నిర్వీర్యం చేసేలా చర్యలు తీసుకోవడం దారుణమన్నారు.
అట్టడుగు, బలహీన, మైనార్టీ వర్గాలను పట్టించుకోక పోవడం పట్ల ఫైర్ అయ్యారు కేసీఆర్. దళిత సమాజం పట్ల వివక్ష కనిపిస్తోందన్నారు. ఇది అంకెల బడ్జెట్ తప్పా ప్రజలకు ప్రయోజనకరంగా లేని బడ్జెట్ గా అభివర్ణించారు.